ప్రజలు మారు మూల గ్రామాల నుండి వచ్చి అధికారులకు తమ సమస్యలపై అర్జీలను ఇచ్చేందుకు వ్యయప్రయాసలకు గురవుతున్నారు. అర్జీ దారుడు ఇచ్చిన అర్జీని పరిష్కరించ వలసిన అధికారికి పంపుటకు ప్రస్తుతం 7 రోజుల నుండి 10 రోజుల వరకు సమయం వృధా అవుతున్నది. ఆయా అర్జీ లని వారు పరిష్కరించుటకు 3 నెలలు నుండి 6 నెలల సమయం పడుతున్నది. అర్జీదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పదే పదే తిరుగుతున్నారు.
ప్రజా సమస్యలను అధికారులు తెలుసుకొనుట మరియు పరిష్కరించుటలో సమస్యగా ఉన్న ఈ పద్దతిని మార్చుటకు గౌ. ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేక శ్రద్ద తీసుకొని ఈ సాఫ్ట్ వేర్ ని రూపొందించుటకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సాఫ్ట్ వేర్ ద్వారా ప్రజల సమస్యలు సకాలంలో పరిష్కరించబడతాయి మరియు ప్రజా సమస్యల పై ప్రభుత్వ అధికారులకు బాధ్యత పెరుగుతుంది.
రాష్ట్ర చరిత్రలో మొదటి సారిగా రాష్ట్ర స్థాయి నుండి మండల స్థాయి అధికారుల వరకు అనుసంధానం చేస్తూ ప్రజల నుండి స్వీకరించే అర్జీలను ఆన్ లైనులో కంప్యూటరీకరించే కార్యక్రమమైన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ' మీకోసం ' ఏర్పాటు చేయబడినది. ప్రజల నుండి వచ్చే అర్జీ వివరములు, వాటి స్థితి మరియు పరిష్కార వివరములు సంక్షిప్త సందేశాలు మరియు ఆన్ లైన్ ద్వారా తెలుసుకొనడం ఇందులోని ప్రత్యేకత. కాల్ సెంటర్ ఏర్పాటు చేసి పరిష్కరించబడిన ఆర్జీల గురించి ఆడిట్ చేయటం మరింత ప్రత్యేకతను సంతరించుకొన్నది. ఈ వెబ్ సైట్ తెలుగు లోనే అభివృద్ధి చేయడం మరో ప్రత్యేకత.